RBI/2018-19/49
FIDD.CO.Plan.BC.08/04.09.01/2018-19
తేదీ: సెప్టెంబర్ 21, 2018
ది చైర్‌మన్ / మానేజింగ్ డైరెక్టర్ /
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మినహా)
అన్నిఎన్ బి ఎఫ్ సి - ఎన్ డి - ఎస్ ఐలు
అయ్యా / అమ్మా,
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు జతగా,
ప్రాధాన్య రంగాలకు రుణాల జారీ
(Co-origination of loans by Banks and NBFCs for lending to priority sector)
మూడవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక 2018-19, తేదీ ఆగస్ట్ 1, 2018 లో, ప్రగతిశీల మరియు నియంత్రణా విధానాల నివేదిక 3 వ పేరా, దయచేసి చూడండి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (డిపాజిట్లు స్వీకరించని, వ్యవస్థాపరంగా ముఖ్యమైనవి, ఎన్ బి ఎఫ్ సి - ఎన్ డి-ఎస్ ఐలు) జతగా, ప్రాధాన్య రంగాలకు రుణాలు కల్పించే (కో-ఆరిజినేషన్, co-origination), విధానం దీనిలో ప్రవేశపెట్టబడినది. ఇందుకై, సవిస్తరమైన మార్గదర్శక సూత్రాలు, ఈక్రింద వివరించబడ్డాయి:
2. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మినహా) మరియు ఎన్ బి ఎఫ్ సి-ఎన్ డి- ఎస్ ఐలు (ఇకపై ఎన్ బి ఎఫ్ సిలు అని పిలువబడును) జతగా, ప్రాధాన్య రంగ అసెట్లు కల్పించాలి. ఈ ఏర్పాటులో, సామాన్య కార్యకలాపాలకు జారీచేసే రుణాలలో ఇద్దరు రుణ దాతల వాటా కలిసి ఉంటుంది. అనుబంధం-1 లో సూచించిన ముఖ్యమైన అంశాలు పాటిస్తూ, నష్ట భయం, ప్రతిఫలాలూ బ్యాంక్, ఎన్ బి ఎఫ్ సి కలిసి, వారి వారి వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా, పరస్పర అంగీకారంతో, పంచుకోవలెను.
3. కో-ఆరిజినేషన్ ఒప్పందంలో, తమ వాటా రుణానికి, ప్రాధాన్య రంగ రుణంగా, బ్యాంకు అర్హత కోరవచ్చు. అయితే, బ్యాంకు వారి ఖాతాలలో చూపుతున్న ప్రాధాన్య రంగ అసెట్లలో, ఎన్ బి ఎఫ్ సివి కలిపి ఎప్పుడూ చూపరాదు. ఇంతేగాక, ఈ విధానంలో, విదేశీ బ్యాంకులు జారీచేసిన రుణాలు, ప్రాధాన్య రంగ అసెట్లుగా యోగ్యతగల రుణాలకు మాత్రమే పరిమితం చేయబడతాయి.
4. స్థిరమైన వడ్డీరేట్ గల రుణాలలో, వారి వారి వడ్డీ రేట్లు, భరిస్తున్న నష్టభయాన్ని కలిపి లెక్కింపులోకి తీసుకొని, అంతిమ రుణ గ్రహీతకు ఒకే మిశ్రమ వడ్డీ రేట్ నిర్ణయించవలెను. అస్థిర వడ్డీరేట్ గల రుణాల విషయంలో, వారి వారి రుణ నిష్పత్తుల ఆధారంగా, బెంచ్‌మార్క్ వడ్డీ రేట్ల వెయిటెడ్ ఏవరేజ్, రుణంపై వడ్డీ రేట్‌గా నిర్ణయించవలెను. బ్యాంక్ వారి వాటా రుణంపై వసూలుచేసిన వడ్డీరేట్, అమలులో ఉన్న రుణాలపై వడ్డీరేట్ల నిబంధనలను అనుసరించి ఉంటుంది. ఇంతేగాక, ఎ న్ బి ఎఫ్ సి-ఎన్ డి–ఎస్ ఐ లుగా వర్గీకరించబడిన ఎన్ బి ఎఫ్ సి-ఎమ్ ఎఫ్ ఐలు, వారి వాటా రుణాలపై, 'క్వాలిఫైయింగ్ అసెట్స్' రుణాలకు వర్తించే, రుణ మూల్యం తదితర మార్గదర్శకాలను పాటించవలెను. మిశ్రమ / వైటెడ్ ఏవరేజ్ వడ్డీ రేట్ల ద్వారా, బ్యాంకుల నుండి లభించే తక్కువ వడ్డీరేట్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలనుండి లభించే చవక సేవలయొక్క ప్రయోజనం, అంతిమ లబ్ధిదారుకు లభించవలెను. బ్యాంకులు, ఎన్ బి ఎఫ్ సిలు రుణానికి సంబంధించిన పూర్తి సమాచారం (వడ్డీ రేట్, ఇతర చార్జీలు, నష్ట భయం పంచుకొనే ఒప్పందం వివరాలు మొ.వి), రిజర్వ్ బ్యాంక్ కోరినప్పుడు, సమర్పించవలెను.
5. కో-ఆరిజినేట్ రుణాలు జారీచేసే ఏర్పాటులో, ఇతర నిబంధనలతోబాటు, బ్యాంక్ /ఎన్ బి ఎఫ్ సిలు ఆర్థిక సేవలలో, పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్, outsourcing) వినియోగానికి సంబంధించి అమలులోనున్న మార్గదర్శకాలు పాటించవలెను. అందువల్ల, ఎన్ బి ఎఫ్ సిలు, వారికీ బ్యాంకుకూ మధ్యగల పరస్పర ఒప్పందం ప్రకారం లోన్ సోర్సింగ్ చేయగలిగినా, బ్యాంకులు, వారి వాటా రుణాన్ని, ఎన్ బి ఎఫ్ సి ద్వారా ఔట్‌సోర్సింగ్ చేయరాదు.
6. ఫిర్యాదుల పరిష్కారం విషయానికొస్తే, రుణగ్రహీత ఎన్ బి ఎఫ్ సి / బ్యాంకులో నమోదు చేసిన ప్రతి ఫిర్యాదు బ్యాంక్ / ఎన్ బి ఎఫ్ సి తో పంచుకోవలెను. ఒక వేళ ఫిర్యాదు 30 రోజులలోగా పరిష్కరించబడని పక్షంలో, రుణ గ్రహీత, బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ / ఎన్ బి ఎఫ్ సి ల ఆంబుడ్జ్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చును.
7. బ్యాంకులు / ఎన్ బి ఎఫ్ సి లు వారి బోర్డ్ అమోదంతో, ఎన్ బి ఎఫ్ సిలు/బ్యాంకులతో కో-ఆరిజినేషన్ ఒప్పందం రూపొందించవలెను. కో-ఆరిజినేషన్ ఒప్పందం క్రిద జారీచేసిన రుణాలు, అంతర్గత మార్గదర్శకాలు, ఒప్పందంలోని నిబంధనలు, మరియు అమలులో ఉన్న నియంత్రణా ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్నాయని రూఢి పరచుకొనుటకు, బ్యాంకుల / ఎన్ బి ఎఫ్ సిల అంతర్గత ఆడిటర్లచే తనిఖీ చేయబడతాయి.
మీ విశ్వాసపాత్రులు,
(గౌతమ్ ప్రసాద్ బోరా)
చీఫ్ జనరల్ మానేజర్-ఇన్-చార్జ్
జతచేయబడినవి: పైన పేర్కొన్నవి
అనుబంధం 1
బ్యాంకులు మరియు ఎన్ బి ఎఫ్ సి - ఎన్ డి- ఎస్ ఐలు జతగా
రుణజారీ చేసే ప్రక్రియలో (కో-ఆరిజినేషన్, Co-origination), ప్రధాన అంశాలు
I. నష్టభయం, ప్రతిఫలం పంచుకొనుట: డైరెక్ట్ ఎక్స్పోజర్‌కు సంబంధించిన నష్టభయం, కనీసం 20%, రుణ కాలపరిమితి వరకు, ఎన్ బి ఎఫ్ సి ఖాతాలో చూపించవలెను. మిగిలినది బ్యాంక్ ఖాతాలలో చూపవలెను. ఎన్ బి ఎఫ్ సి, జారీ చేసిన రుణంలో తమవాటా, జతకలిసిన బ్యాంకు నుండిగాని, లేదా వారి అనుబంధ సంస్థలనుండిగానీ, రుణంగా పొందలేదని, బ్యాంకుకు హామీ ఈయవలెను.
II. వడ్డీ రేట్: ఎన్ బి ఎఫ్ సి, వారికి తోచిన విధంగా వారివాటా రుణానికి ధర నిర్ణయించే స్వేఛ్చ ఉంది. బ్యాంకు, నష్ట భయం భరించుటకు వారికి గల తెగువ, రుణగ్రహీతపై అంచనా, ఆర్ బి ఐ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న నిబంధనలకు అనుసారంగా, తగిన మూల్యం నిర్ణయించవలెను. ఏక మిశ్రమ వడ్డీరేట్ / వైటెడ్ ఏవరేజ్ తెలుసుకొనుటకు, అనుబంధం 2 లో ఉదాహరణ చూపబడింది. అయితే, రుణం మీద ఏక మిశ్రమ / వైటెడ్ ఏవరేజ్ వడ్డీరేట్ విధించినప్పటీకీ, వసూలు చేసిన వడ్డీ, బ్యాంక్ / ఎన్ బి ఎఫ్ సి, వారి వాటాల నిష్పత్తిలో పంచుకోవలెను.
III. మీ ఖాతాదారుని తెలుసుకోండి (KYC): కో-ఆరిజినేటింగ్ రుణ దాతలు, బ్యాంకింగ్ నియంత్రణ విభాగం (డి బి ఆర్) / బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నియంత్రణ విభాగం (డి ఎన్ బి ఆర్) జారీచేసిన కె వై సి /ఎ ఎమ్ ఎల్ మార్గదర్శకాలూ మరియు డి బి ఆర్ జారీచేసిన 'మాస్టర్ డైరెక్షన్ ఆన్ కె వై సి', పారా 14 లోని, మార్గదర్శకాలను పాటించవలెను.
IV. రుణ మంజూరు: ఎన్ బి ఎఫ్ సి, కో-ఆరిజినేట్ చేయుటకు యోగ్యమైన ప్రతిపాదనలను, బ్యాంకుకు సిఫారసు చేయవలెను. రుణదాతలు ఇద్దరూ, రుణగ్రహీతయొక్క అవసరాలు, నష్టభయం, స్వతంత్రంగా అంచనావేయవచ్చు. రుణ ఒప్పందం, బ్యాంకు మరియు ఎన్ బి ఎఫ్ సి, రుణ దాతలుగా; ఖాతాదారు రుణగ్రహీతగా, ముగ్గురు కక్షిదారులు కలిగి ఉంటుంది.
V. ఉమ్మడి ఖాతా: బ్యాంకు, ఎన్ బి ఎఫ్ సి వారి వాటా రుణం జారీచేయుటకు, రుణగ్రహీతలు తిరిగి చెల్లించిన రుణ మొత్తాలు పంచుకొనుటకు, ఎస్క్రో వంటి ఉమ్మడి ఖాతా తెరవవలెను. ఈ నిధులు 'ఫ్లోట్' (float) గా వినియోగించరాదు. రుణ బకాయిలకు సంబంధించి, ఎన్ బి ఎఫ్ సి / బ్యాంక్, రుణ గ్రహీతల వ్యక్తిగత ఖాతాలు నిర్వహించవలెను. అవసరమైన సమాచారం, బ్యాంక్ /ఎన్ బి ఎఫ్ సి పరస్పరం పంచుకోవడం ద్వారా, ఖాతాదారుకు, ఒకే నివేదిక ఇవ్వవలెను.
VI. పర్యవేక్షణ & వసూలు: ఇరువురూ అంగీకరించిన విధంగా, రోజువారీ పర్యవేక్షణకు మరియు రుణమొత్తం వసూలుకు, ఒక విధానం రూపొందించవలెను.
VII. హామీ మరియు హక్కు పొందుట (సెక్యూరిటీ మరియు చార్జ్, Security and Charge creation): పరస్పరం అంగీకరించిన షరతులతో, రుణగ్రహీతనుండి, హామీ, చార్జ్, తీసుకోవలెను.
VIII. కేటాయింపు / నివేదిక (provisioning / reporting): ఎవరికి వర్తించే నియంత్రణా మార్గదర్శాకాల అనుసారం, వారు కేటాయింపులు (నిరర్థక ఆస్తులతోసహా) చేయవలెను. రుణంలో వారి భాగానికి, వారి వారికి వర్తించే చట్టలకు అనుగుణంగా, నివేదికలు సమర్పించు (ఫరపతి సమాచార కంపెనీలకుకూడా) విధానం పాటించవలెను.
IX. హక్కుల బదిలీ / రుణ పరిమితిలో మార్పు (assignment / change in loan limits): రుణాలపై హక్కుల బదిలీ లేక కో-ఆరిజినేట్ రుణ పరిమితి పెంచుట, పరస్పర అంగీకారముతోనే చేయవలెను.
X. ఫిర్యాదుల పరిష్కారం: కో-ఆరిజినేట్ పద్ధతిలో అందచేస్తున్న ఉత్పత్తులకు, వారి స్వంత ఉత్పత్తులకు మధ్య భేదాన్ని ఖాతాదారుకు వివరించడం, ఎన్ బి ఎఫ్ సియొక్క బాధ్యత. ఖాతాదారుకు సేవలందించుట, వారి ఫిర్యాదులు పరిష్కరించుట, ప్రథమ రుణదాత బాధ్యత. కానీ, ఎన్ బి ఎఫ్ సి మరియు/లేక బ్యాంకుకు చేసిన ఫిర్యాదు, బ్యాంకు/ఎన్ బి ఎఫ్ సి తో పంచుకోవలెను. ఫిర్యాదు 30 రోజులలో పరిష్కారం కానిచో, ఖాతాదారు, బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్ / బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆంబుడ్జ్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చును.
XI. వ్యాపార కొనసాగింపు ప్రణాళిక: కో-ఆరిజినేట్ ఒప్పందంలో బ్యాంక్ మరియు ఎన్ బి ఎఫ్ సి, రుణగ్రహీతలు, రుణం తిరిగి చెల్లించేవరకు, అంతరాయం లేకుండా సేవలందించుటకు తగిన ప్రణాళిక రూపొందించవలెను. |