RBI/2019-20/172
DoS.CO.PPG.BC.01/11.01.005/2019-20
మార్చి 16, 2020
చైర్‌మన్ / మానేజింగ్ డైరెక్టర్ / చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా) /
అన్ని స్థానిక బ్యాంకులు /అన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు/ అన్ని చెల్లింపు బ్యాంకులు /
అన్ని నగర సహకార బ్యాంకులు / బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు
అమ్మా / అయ్యా,
కోవిడ్-19 – వ్యాపార వ్యవహారాలు నిరంతరాయంగా కొనసాగించుటకు చర్యలు
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న నోవల్ కరొనా వైరస్ డిసీజ్ ను (కోవిడ్-19) ప్రపంచ ఆరోగ్య సంస్థ, మహమ్మారిగా పేర్కొంది. ఈవ్యాధి తీవ్రత ఎంత? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది ఏమేరకు ప్రభావితం చేస్తుంది? అన్నది ఇంకా అంతుచిక్కని విషయం. మనదేశంలోకూడా, ఎంతోమంది ఈరోగం బారిన పడినట్లు కనుగొనబడింది. ఈ పరిస్థితిలో, భవిష్యత్తులో ఎదురయే సమస్యలు ఎదుర్కొనుటకు, దేశ ఆర్థిక వ్యవస్థయొక్క సుస్థిరత కాపాడుటకు, ఒక సమన్వయ ప్రణాళిక ఎంతో అవసరం.
2. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల సహకారంతో వ్యాధి నిరోధనకు, వ్యాప్తి అరికట్టుటకు ఇప్పటికే చర్యలు తీసుకొంటోంది. అయితే, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వారి వ్యాపారానికి అంతరాయం కలుగకుండా, మరికొన్ని చర్యలు (ఈ క్రింద సూచించిన వాటితోసహా) తీసికోవలసిన అవసరం ఉంది.
(a) వారి సంస్థలలో ఈవ్యాధి వ్యాప్తి నిరోధించుటకు ప్రణాళిక రూపొందించవలెను. ఇంతేగాక, ఒకవేళ సిబ్బందికి వ్యాధిసోకినట్లయితే, వారిని వేరుగా ఉంచుటకు (క్వారంటీన్, quarantine), ప్రయాణ అవసరాలకు సంబంధించి, సిబ్బంది / ఖాతాదారులు భయాందోళనలు చెందకుండా, తక్షణ చర్యలు చేపట్టవలెను.
(b) కీలకమైన వ్యాపార ప్రక్రియలు మరియు వ్యాపార కొనసాగింపు ప్రణాళిక (బిజినెస్ కంటిన్యుఇటీ ప్రణాళిక, BCP) పరిశీలించి, వ్యాధి వల్ల లేక ముందుజాగ్రత్త చర్యల కారణంగా సిబ్బంది హాజరుకానిచో, ముఖ్యమైన సేవలకు అంతరాయం కలుగకుండా, చర్యలు తీసికోవలెను.
(c) ఆరోగ్య అధికారులు ఎప్పటికప్పుడు జారీచేసే ఆదేశాలపై అన్ని స్థాయిల సిబ్బందికి అవగాహన కల్పించి, అనుమానాస్పద సందర్భాలలో, వారు తగిన ముందు జాగ్రత్తలు పాటించుటకు అవసరమైన, చర్యలు తీసికోవలెను.
(d) వీలైనంతవరకు, డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు వినియోగించుకోవలెనని, ఖాతాదారులను ప్రోత్సహించవలెను.
3. పైన చర్యలు మాత్రమేగాక, ఒకవేళ కోవిడ్-19 భారతదేశంలో వ్యాప్తివల్ల, లేక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పతనంవల్ల, మన ఆర్థిక సంస్థల బ్యాలెన్స్ షీట్లు, ఆస్తుల నాణ్యత, ద్రవ్యత ఏవిధంగా ప్రభావితమౌతాయో అంచనా వేయవలెను. ఈవిశ్లేషణ ఆధారంగా, నష్టభయ నివారణకు తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి, మాకు తెలియపరచవలెను.
4. వ్యాపార, సామాజిక లక్ష్యాల దృష్ట్యా పరిస్థితిని సూక్ష్మంగా పర్యవేక్షించడం తప్పనిసరి. ఇందుకొరకై ఒక ప్రత్యేక బృందం (క్విక్ రెస్పాన్స్ టీమ్) ఏర్పాటుచేయడం అవసరం. మారుతున్న పరిస్థితులు ఉన్నత యాజమాన్యానికి తెలియపరచుటకు, నియంత్రణాధికారులు / ఇతర సంస్థలు సంప్రదించుటకు, ఈ బృందం ఒక కేంద్ర స్థానంగా పనిచేయాలి.
మీ విశ్వాసపాత్రులు,
(అజయ్ కుమార్ చౌదరి)
చీఫ్ జనరల్ మానేజర్ |