సెప్టెంబర్ 16, 2015
చిన్న ఆర్థిక బ్యాంకులకై 10 దరఖాస్తుదారులకు రిజర్వ్ బ్యాంక్ 'సూత్రప్రాయపు' అనుమతి మంజూరు
నవంబరు 27, 2014 తేదీన జారీ చేయబడ్డ 'ప్రైవేట్ రంగంలో చిన్న ఆర్థిక బ్యాంకుల అనుమతికి మార్గదర్శకాలకు' (మార్గదర్శకాలు) అనుగుణంగా, ఈ క్రింద ఇవ్వబడ్డ 10 దరఖాస్తుదారులకు, చిన్న ఆర్థిక బ్యాంకులు ప్రారంభించడానికి 'సూత్రప్రాయంగా' అనుమతి మంజూరు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు నిశ్చయించింది
ఎంపిక చేసిన దరాఖాస్తుదారుల పేర్లు
- Au ఫైనాన్సియర్స్ (ఇండియా) లిమిటెడ్, జైపూర్
- క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్, జలంధర్
- దిశా మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్, అహమ్మదాబాద్
- ఈక్విటాస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై
- ESAF మైక్రోఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై
- జనలక్ష్మి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు
- RGVN (నార్త్ ఈస్ట్) మైక్రోఫైనాన్స్ లిమిటెడ్, గువహాతి
- సూర్యోదయ్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ ముంబయి
- ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు
- ఉత్కర్ష్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్,వారణాశి
అభ్యర్థులు, మార్గదర్శకాల్లో సూచించిన అన్ని షరతులు ఇంకా రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించే ఇతర నిబంధనలు పాటించడానికి అనువుగా, ఈ 'సూత్రప్రాయపు' అనుమతి 18 నెలలు వరకు చెల్లుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు 'సూత్రప్రాయపు' అనుమతిలో భాగంగా సూచించిన నిబంధనలను పాటించారు అని తృప్తి చెందిన తరువాత రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 22(1) క్రింద బ్యాంకింగ్ కార్యకలాపాల్ని ఆరంభించడానికి అనుమతి జారీ చెసే విషయం పరిశీలిస్తుంది. సక్రమమైన అనుమతి జారీ చేసేవరకు, దరఖాస్తుదారులు ఏ విధమైన బ్యాంకింగ్ కార్య కలాపాలు చేపట్టరాదు.
ఎంపిక ప్రక్రియ:
మూడు వివిధ సంఘాలు, ప్రతి ఒక్క అభ్యర్థన పై చేసిన అధ్యయనం, ఈ అభ్యర్థుల ఎంపికలో రిజర్వ్ బ్యాంక్ తుది నిర్ణయానికి దోహదం చేసింది. ఎంపిక ప్రక్రియ ఈ క్రింది క్రమంలో జరిగింది:
ముందుగా, ఒక ఆర్ బి ఐ బృందం, మార్గదర్శకాల ప్రకారం, అభ్యర్థుల కనీస మూలధనం సమీకరించే సామర్థ్యం, యాజమాన్య హోదా, స్థానికుల నియంత్రణ మొదలైన ప్రాథమిక అర్హతలను పరిశీలించింది. ఈ ప్రాథమిక పరిశీలనలో వెల్లడయిన విషయాలు, రిజర్వ్ బ్యాంక్ మాజీ డెప్యూటీ గవర్నర్, శ్రీమతి ఉషా థోరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాహ్య సలహా సంఘానికి (External Advisory Committee (EAC)) సమర్పించబడ్డాయి. EAC, మార్గదర్శకాల్లో సూచించిన ప్రాథమిక అర్హతలు కలిగి ఉన్న కొన్నిఅభ్యర్థనలను, సమగ్ర పరిశీలనకు సిఫారసు చేసింది.
ఈ సమగ్ర పరిశీలనలో, దరఖాస్తుదారుల ఆర్థిక స్వస్థత; అనుసరించబోయే వ్యాపార వ్యూహం; నియంత్రణ/పరిశోధనా సంస్థలు, బ్యాంకులు వారి యోగ్యత, అర్హతలపై ఇచ్చిన ప్రత్యేక నివేదికలు మొదలైనవి అధ్యయనం చేయబడ్డాయి. ప్రత్యేకించి, బ్యాంకింగ్ సేవలు అందని ప్రాంతాలు, వర్గాలను చేరుకునే ప్రణాళికలు పరిశీలించబడ్డాయి. వారికి సమర్పించిన సమాచారం ఆధారంగా, EAC, అనేకమార్లు దరఖాస్తులపై చర్చలు జరిపిన తరువాత, వారి సిఫారసులను రిజర్వ్ బ్యాంక్ కు అందచేసింది.
తదనంతరం, గవర్నర్, నలుగురు డెప్యూటీ గవర్నర్లు సభ్యులుగా గల అంతర్గత ఎంపిక సంఘం (Internal Screening Committee (ISC)) దరఖాస్తులను పరిశీలించింది. EAC సిఫారసుల ఔచిత్యం పై కూడా ISC సమాలోచనలు జరిపింది. అన్ని దరఖాస్తులు పరిశీలించిన తరువాత ISC, స్వతంత్రంగా వారి సిఫారసుల్ని, రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ కమిటీకి (CCB) సమర్పించింది. సెప్టెంబర్ 16, 2015 న జరిగిన సెంట్రల్ బోర్డ్, సమావేశంలో, CCB లోని బయటి సభ్యులు, EAC మరియు ISC ల వ్యాఖ్యలను, సిఫారసులను పరిశీలించి, 'సూత్రప్రాయపు' అనుమతి జారీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల జాబితాని ఖరారు చేసింది. EAC చేసిన సిఫారసులకు కారణాలు వివరించడానికి, ఆ కమిటీ చైర్‌మన్ కూడా ఆహ్వానించబడ్డారు.
ఈ అనుమతులు ఇవ్వడంలో సంపాదించిన అనుభవంతో, రిజర్వ్ బ్యాంక్, మునుముందు, ఈ అనుమతులు నిత్యమూ జారీ చేసే దిశగా, మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని యోచిస్తోంది.
నేపథ్యం:
ఆర్థిక రంగ సంస్కరణల సంఘం 2009 (Committee on Financial Sector Reforms) (చైర్‌మన్: డా. రఘురామ్ జి. రాజన్), మన దేశ పరిస్థితుల దృష్ట్యా, చిన్న బ్యాంకుల అవసరాన్ని గురించి అధ్యయనం చేసిన సంగతి విదితమే. మారుతున్న పరిస్థితుల్లో, ప్రయోగాత్మకంగా, చిన్న బ్యాంకులకు అనుమతులు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని కమిటీ అభిప్రాయపడింది. తదనుసారంగా, ప్రైవేట్ రంగంలో సమర్థవంతమైన పనితీరుతో, డిపాజిట్లను అంగీకరించే, చిన్న ఆర్థిక బ్యాంకులను (SFBs) అనుమతించాలని సూచించింది. భౌగోళికంగా వ్యాపారాన్ని కేంద్రీకరించడం వల్ల సంభవించగల నష్టాన్ని, అధిక మూలధనాన్ని కోరడంద్వారా, ఒకే కూటమికి పరిమితమయ్యే లావాదేవీలు నిషేధించడం ద్వారా, కేంద్రీకరణ పరిమితుల్ని తగ్గించడంద్వారా, పూరించవచ్చని భావించింది. ఇదే విషయం, రిజర్వ్ బ్యాంక్ ఆగస్ట్ 27, 2013 న తమ వెబ్ సైట్‌లో ప్రచురించిన 'భారత దేశం లో బ్యాంకింగ్ వ్యవస్థ - పురోగమన దిశ' (‘Banking Structure in India – The Way Forward’) అన్న చర్చాపత్రంలో, తిరిగి చెప్పబడింది.
జులై 10, 2014 న సమర్పించిన 2014-2015 కేంద్ర బజెట్‌లో గౌరవనీయులైన ఆర్థిక మంత్రి ఈ క్రింది ప్రకటన చేశారు:
"ప్రస్తుతం ఉన్న విధానాల్లో మార్పులు చేసిన అనంతరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో సార్వజనిక బ్యాంకులకు నిరంతరంగా అనుమతులిచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయబడుతుంది. ఈదిశగా, ఆర్ బి ఐ, చిన్న బ్యాంకులకు, ప్రత్యేక తరహా బ్యాంకులకు అనుమతులిచ్చే ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ ప్రత్యేక తరహా బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు - చిన్న వ్యాపారస్తులకు, అసంఘటిత రంగ కార్మికులకు, అల్పాదాయ వర్గాలకు, రైతులకు, వలస కార్మికులకు రుణ సౌకర్యాలను మరియు సొమ్ము పంపే సౌలభ్యాలను అందించడానికి ఉద్దేశించబడ్డాయి"
ప్రజల వ్యాఖ్యల కోసం, మార్గదర్శకాల ముసాయిదా జులై 17, 2014 తేదీన విడుదల చేయబడింది. వచ్చిన వ్యాఖ్యలు, సలహాలు ఆధారంగా, చిన్న ఆర్థిక బ్యాంకుల అనుమతుల విధానంపై తుది మార్గదర్శకాలు, నవంబర్ 27, 2014 న జారీచేయబడ్డాయి. మార్గదర్శకాలపై వచ్చిన మొత్తం 176 ప్రశ్నలపై రిజర్వ్ బ్యాంక్, జనవరి 1, 2015 న వివరణలు ఇచ్చింది. చిన్న ఆర్థిక బ్యాంకులకోసం 72 దరఖాస్తులు అందాయి. అయితే, తరువాత, మైక్రోసెక్ రిసౌర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్కతా, వారి దరఖాస్తును ఉపసంహరించుకొంది. శ్రీ అజయ్ సింగ్ బింభెట్ తదితరులు చేసిన మరో దరఖాస్తు విషయంలో, ఇద్దరు కో-ప్రమోటర్లు, వారి అభ్యర్థిత్వాన్ని, వెనక్కి తీసుకోవడంవల్ల, దరఖాస్తు ఉపసంహరించుకొన్నట్లుగా భావించబడింది.
అదనపు వివరాలు:
ప్రాథమిక అర్హతలు ఉన్నాయా లేదా అని నిర్ణయించిన తరువాత, దరఖాస్తులని, ఇందుకోసం ఏర్పరచిన బాహ్య సలహా సంఘానికి (EAC) పంపాలని మార్గదర్శకాల్లో ఇవ్వబడింది. అందువల్ల, దరఖాస్తులు నిశితంగా పరిశీలించడానికి, మార్గదర్శకాల్లో సూచించిన షరతులు పాటించేవారికి మాత్రమే అనుమతులు సిఫారసు చేయడానికి, రిజర్వ్ బ్యాంక్, శ్రీమతి ఉషా థోరత్, మాజీ డెప్యూటీ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆధ్వర్యంలో, ఫిబ్రవరి 4, 2015 న ఒక EAC ని ఏర్పరచింది. EAC లో ముగ్గురు సభ్యులు ఉండేవారు: శ్రీ ఎమ్ ఎస్ సాహూ, SEBI మాజీ సభ్యులు; శ్రీ ఎమ్ ఎస్ శ్రీరామ్, ప్రొఫెసర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బెంగళూరు మరియు శ్రీ ఎమ్ బాలచంద్రన్, చైర్‌మన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తరువాత, శ్రీ ఎమ్ ఎస్ సాహూ, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యులుగా నియమింపబడ్డ కారణంగా, EAC నుండి వైదొలగడం వల్ల, రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2015 లో, శ్రీ రవి నారాయణ్ ను (వైస్ చైర్మన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) కమిటీలో నియమించింది.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2015-2016/693 |