మే 06, 2016
భారతీయ రిజర్వ్ బ్యాంక్ - రిసర్చ్ ఇంటర్న్‌షిప్ పథకం (Research Internship Scheme)
భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్ర బ్యాంకింగ్ రంగంలో ఉత్కృష్టమైన పరిశోధనా విధానాలు తెలుసుకొనే అవకాశం కల్పించడానికి రిసర్చ్ ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభించింది. ఈ పథకం ఇటివలే పట్టం పొంది, ఆర్థిక, బ్యాంకిం గ్, ఫైనాన్స్ లేక ఇతర సంబంధిత రంగాల్లో PhD చెయ్యాలని లేక పరిణామ/ విశ్లేషణాత్మక చాతుర్యం కావలసిన, ప్రభుత్వ పరిశోధన, ఆర్థిక సంస్థల్లో పదవులు ఆశిస్తున్న పిన్న వయస్కుల కోసం ఉద్దేశించబడింది.
పథకంయొక్క ముఖ్యాంశాలు:
పాత్ర వివరణ
ఇంటర్న్స్ (interns), ప్రతిష్ఠాత్మక అర్థ/ విత్త శాస్త్ర పత్రికలలో ప్రచురణకై ఉద్దేశించిన వ్యాసరచనలకు అవసరమయే సాధన సామగ్రి సమకూర్చడంలో, రిజర్వ్ బ్యాంక్ పరిశోధకులకు సహాయం అందించాలి. రిసర్చ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి సంబంధించి, సమయానికి ఖచ్చితమైన గణాంకాలు, ఆర్థిక ఉపకరణాలు సంకలనం చేయడంలో తోడ్పడాలి. తగిన నాణ్యత కలిగిన పరిశోధనా/ విధాన వ్యాసాలు వ్రాయవచ్చు.
అర్హతలు
ఇంటర్న్‌గా చేరడానికి ముందు, అభ్యర్థులు మూడు ఏళ్ళ డిగ్రీ మరియు మరొక సంవత్సరం పోస్ట్- గ్రాడ్యుఏట్ చదువు లేక 4 ఏళ్ళ సమగ్ర పాఠ్యక్రమంలో B.Tech లేదా BE చదివి ఉండాలి. స్వయంప్రేరణ కలిగి, ఆర్థిక, విత్త గణాంక శాస్త్రాల్లో, పట్టా గలిగిన లేక కంప్యూటర్/ డాటా అనలిటిక్స్/ ఇంజనీరింగ్ శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులు, రిజర్వ్ బ్యాంక్ కావాలనుకొంటోంది. ప్రోగ్రామింగ్ నైపుణ్యం లేదా అది నేర్చుకొనే సామర్థ్యం కలిగి ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ కార్యాలయ వాతావరణం, విజ్ఞానార్జనకు, పరిశోధనకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. అభ్యర్థులు, రిజర్వ్ బ్యాంక్ పరిశోధనల మూల అంశాలపై విశేషమైన ఆసక్తి కలిగి ఉండి, ఆ అంశాలలో బ్యాంక్ చేసిన కృషి ద్వారా ప్రయోజనం పొందగలిగి ఉండాలి. ఈ అవకాశం దేశ / విదేశీ అభ్యర్థులు కోసం అందుబాటులో ఉంది. ఉద్యోగానుభవం అవసరం లేదు.
దరఖాస్తు చేసే విధానం
రిజర్వ్ బ్యాంక్ అవసరాలనిబట్టి, ఇంటర్న్‌షిప్ జనవరి 1 లేక జులై 1 నుండి ప్రారంభమయేలా, ఏడాదికి రెండుసార్లు, ఎంపిక ఉంటుంది. దరఖాస్తులు ఆ అర్ధ సంవత్సరంలో మొదటి ఐదు నెలలు అంగీకరించబడతాయి. ఉదా: జనవరి 1 నుండి ప్రారంభమయ్యే ఇంటర్న్‌షిప్ లకు, ముందు ఏడాది జులై-నవంబర్ వరకు దరఖాస్తులు తీసుకోబడి, డిసెంబర్ నెలలో పరిశీలించబడతాయి. అదే విధంగా, జులై 1 న ప్రారంభమయే ఇంటర్న్‌షిప్ లకు, జనవరి-మే మధ్యలో దరఖాస్తులు అంగీకరించబడి, జూన్ నెలలో పరిశీలించబడతాయి. CV, యోగ్యతా పత్రాలు (references) ఆశయ నివేదికల (statement of purpose) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి, ముఖాముఖికి (interview) పిలవడం జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు, సంబంధించిన పరిశోధనా విభాగానికి, పై పత్రాలు ఇ-మైల్ ద్వారా పంపడం ఇంకా మంచిది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇకనమిక్ అండ్ పాలిసీ రిసర్చ్‌కి (DEPR) ఇ-మైల్ పంపడానికి ఇక్కడ నొక్కండి; డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (DISM) కు పంపడానికి దయచేసి ఇక్కడ నొక్కండి; స్ట్రేటెజిక్ రిసర్చ్ యూనిట్ (SRU) కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి.
ఎంపిక ప్రక్రియ
రిజర్వ్ బ్యాంక్, ప్రతి సంవత్సరం, 10 మంది ఇంటర్న్‌లను ఎంపిక చేస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇకనమిక్ అండ్ పాలిసీ రిసర్చ్(DEPR)/ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (DISM)/ స్ట్రేటెజిక్ రిసర్చ్ యూనిట్ (SRU) వంటి విభాగాల్లో, వీరి నియామకం జరుగుతుంది.
కాల పరిమితి
ఇంటర్న్‌షిప్ 6 నెలల వరకు కొనసాగుతుంది. ఇంటర్న్ యొక్క ప్రతిభని బట్టి, విభాగం యొక్క అవసరాలనిబట్టి, మరొక 6 నెలలు పొడిగించవచ్చు. అత్యంత ప్రతిభావంతులైన వారి గడువు మరింత పొడిగించవచ్చు ఇంటర్న్‌షిప్ మొత్తం కాలపరిమితి, 6 నెలలకొకసారి జరిపే సమీక్ష ఆధారంగా, రెండు సంవత్సరాల వరకు ఉండవచ్చు)
ఇంటర్న్‌షిప్ ముంబై, ఇండియాలో ఉంటుంది. ఏ కారణం చూపకుండా, ఒక నెల నోటీసుతో ఇంటర్న్‌షిప్నుండి తొలగించడానికి, రిజర్వ్ బ్యాంకు హక్కు కలిగి ఉంటుంది.
సదుపాయాలు
రిజర్వ్ బ్యాంక్, కార్యాలయ స్థలం/అంతర్జాల సంధాయకత (internet connectivity) తదితర అవసరమైన సదుపాయాలు సమకూరుస్తుంది. రిజర్వ్ బ్యాంక్, నెలకు రూ. 35,000/- నిర్ణీత వేతనం (stipend) చెల్లిస్తుంది. ఇంటర్న్‌లు, నివాసానికి ఏర్పాట్లు సొంతంగా చేసుకోవాలి.
నియామకానికై హక్కు పొందరు
కేవలం ఇంటర్న్‌షిప్ ఇచ్చినందువల్ల వారికి రిజర్వ్ బ్యాంక్‌లో పదవికి ఏవిధమైన హక్కు / అర్హత లభించదు.
రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైట్ https://opportunities.rbi.org.in/scripts/bs_viewcontent.aspx?Id=3167 లో, మరికొన్ని వివరాలు చూడవచ్చు.
సంగీతా దాస్
డైరెక్టర్
పత్రికా పకటన : 2015-2016/2600 |