నవంబర్ 08. 2016
రూ.500. రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణి రద్దు: ఆర్ బీ ఐ నోటీసు
భారత ప్రభుత్వము నవంబర్ 08. 2016న విడుదల చేసిన నోటిఫికేషన్ నెం. 2652 ద్వారా, రిజర్వ్ బ్యాంకుచే నవంబర్ 08. 2016 వరకు విడుదల చేసిన మహాత్మా గాంధీ సిరీస్‌లోని రూ.500. రూ.1000 విలువ కలిగిన, బ్యాంకు నోట్ల యొక్క చట్టబద్ధమైన చలామణిని రద్దు చేయడం జరిగింది.
భారతీయ బ్యాంకునోట్లకు నకిలీ నోట్లను అరికట్టడానికి, నగదు రూపంలో దాచుకున్న నల్లధనాన్ని నిర్వీర్యం చేయడానికి, నకిలీ నోట్ల రూపంలో ఉగ్రవాదానికి లభిస్తున్న నిధులకు అడ్డుకట్ట వేయడానికి ఈ చర్యలు తీసుకున్నారు.
నవంబర్ 10, 2016 నుంచి ఈ నోట్లను కలిగి ఉన్న ప్రజలు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, సొసైటీలు, ట్రస్టులు మొదలగు వారు ఆ నోట్లను RBI కార్యాలయమునందైనా లేదా ఏ బ్యాంకు శాఖలోనైనా సమర్పించి, వాటి సమానార్థక విలువను తమ తమ అకౌంట్లలో జమచేసుకోవచ్చు.
ఈ నోట్లను మార్చుకుంటున్నవారు తమ అత్యవసర లావాదేవీల నిమిత్తం, ఒక్కొక్కరూ రూ.4000 వరకు విలువ కలిగిన నోట్లను ఆయా బ్యాంకు శాఖల కౌంటర్లలో సమర్పించి వాటిని మార్చుకొనవచ్చును.
ఈ మార్పిడి అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రజలు ఒక చెల్లుబాటయ్యే ధృవవపత్రాన్ని సమర్పించాలని కోరడమైనది.
బ్యాంకు అకౌంట్లలో జత చేసిన నగదు విలువను చెక్కులు జారీ చేసి స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు లేదా NEFT, RTGS, IMPS, మొబైల్ బ్యాంకింగ్,
ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొద. ఎలెక్ట్రానిక్ బదిలీ రూపంలో ఉపయోగించుకోవచ్చు. బ్యాంకు కౌంటర్ల ద్వారా బ్యాంకు అకౌంట్లలోని నగదు ఉపసంహరణపై
నవంబర్ 9, 2016 నుండి నవంబర్ 18, 2016న వాణిజ్య లావాదేవీలు ముగిసే సమయం వరకు రోజుకు రూ.10,000, వారం మొత్తానికి రూ.20,000కు లోబడి ఉండేలా పరిమితి విధించడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిమితిని సమీక్షించడం జరుగుతుంది.
రీకాలిబ్రేషన్‌ను చేసేందుకు వీలుగా అన్ని ఏటీఎంలు మరియు క్యాష్ మెషీన్లు నవంబర్ 9, 2016న మూసివేయబడతాయి. అవి సిద్ధమైన తర్వాత వాటిని రీయాక్టివేట్ చేయడం జరుగుతుంది. నవంబర్ 18, 2016 వరకు ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ రోజుకు, ఒక్కో కార్డుకు రూ.2000గా పరిమితి ఉంటుంది. ఈ పరిమితిని నవంబర్ 19, 2016 నుంచి రోజుకు, ఒక్కో కార్డుకు రూ.4000కు పెంచడం జరుగుతుంది.
ఏ వ్యక్తి అయినా పైన పేర్కొన్న నోట్లను తమ బ్యాంకు అకౌంట్లలో డిసెంబర్ 30, 2016న లేదా ఆ లోపు మార్చుకోలేకపోయినట్లయితే, అలాంటి వారు రిజర్వ్ బ్యాంక్ నిర్దిష్ట కార్యాలయాలలో లేదా అలాంటి ఇతర కార్యాలయాల వద్ద రిజర్వ్ బ్యాంక్ ఆ తర్వాత ఇచ్చే గడువు లోపు వాటిని మార్చుకొనేందుకు అవకాశం కల్పించబడుతుంది.
మరిన్ని వివరాలు మరియు సమాచారం కోసం ప్రజలు RBI వెబ్‌సైట్ www.rbi.org.in మరియు ప్రభుత్వ వెబ్ సైట్ www.finmin.nic.in ను సందర్శించవచ్చు.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1142 |