నవంబర్ 11, 2016
తగినంత నగదు ఉంది, భరోసా ఇచ్చిన RBI; ప్రజలు ఓపిక పట్టి, నోట్లను తమకు అనుకూలంగా ఉన్న సమయంలో మార్చుకోవాలని విజ్ఞప్తి
ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ - రూ.500 మరియు రూ.1000 నోట్ల చట్టబద్ధమైన చలామణిని రద్దు చేసిన నేపథ్యంలో, కొత్త రూ.2000 నోట్లు మరియు ఇతర విలువ కలిగిన నోట్లను సరఫరా చేయడానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది.
బ్యాంకుల వద్ద తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయి. అంతే కాకుండా కరెన్సీ నోట్లను దేశవ్యాప్తంగా పంపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. బ్యాంకుల శాఖలు ఇప్పటికే నవంబర్ 10, 2016 నుండి నోట్ల మార్పిడి ప్రక్రియను చేపట్టాయి.
RBI ప్రకటనల్లో పేర్కొన్నట్లుగా బ్యాంకులు తమ ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకసారి ఏటీఎంలు పని చేయడం ప్రారంభించాక, ప్రజలు ఏటీఎంల నుంచి నవంబర్ 18, 2016 వరకు ఒక కార్డుపై రోజుకు అత్యధికంగా రూ.2000 విత్ డ్రా చేసుకోవచ్చు; ఆ తర్వాత ఒకో కార్డుపై రోజుకు రూ.4000 విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు రీకాలిబ్రేషన్ పూర్తి చేసిన కారణంగా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటికే చాలా ఏటీఎంలలో రూ.2000ను విత్ డ్రా చేసుకోవడాన్ని అనుమతించడం ప్రారంభమైంది.
రూ.500 మరియు రూ.1000 విలువ కలిగిన నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం సుమారు 50 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ప్రిజలు ఓపిక పట్టి, నోట్లను డిసెంబర్ 30 లోపు తమకు అనుకూలంగా ఉన్న సమయంలో మార్చుకోవాలని RBI ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
అల్పనా కిల్లావాలా
ప్రధాన సలహాదారు
ప్రెస్ రిలీజ్ : 2016-2017/1182 |