డిసెంబర్ 31, 2016
విదేశాల్లో ఉన్న భారత పౌరులకు, NRI లకు నిర్దిష్టమైన బ్యాంక్ నోట్లు [Specified Bank
Notes (SBNs)] మార్చుకొనేందుకు సౌకర్యం ప్రవేశపెట్టిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
నవంబర్ 9, 2016 మరియు డిసెంబర్ 30, 2016 మధ్యకాలంలో విదేశాల్లో ఉన్న భారత పౌరులు, NRI లు, నిర్దిష్టమైన బ్యాంక్ నోట్లు [Specified Bank Notes (SBNs)] మార్చుకొనేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్, ఒక సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
నవంబర్ 9, 2016 మరియు డిసెంబర్ 30, 2016 మధ్య విదేశాల్లో ఉన్న భారత పౌరులు, మార్చ్ 31, 2017 వరకు; నవంబర్ 9, 2016 మరియు డిసెంబర్ 30, 2016 మధ్య విదేశాల్లో ఉన్న NRIలు, జూన్ 30, 2017 వరకు ఈసదుపాయం వినియోగించుకోవచ్చును.
అర్హులైన భారత పౌరులకు నగదు పరిమితి లేకపోయినా, NRI లకు FEMA నిబంధనలను అనుసరించి, పరిమితి ఉంటుంది. వారు వ్యక్తిగత హోదాలో ఈగడువులోపు, ఆధార్ నంబరు, PAN మొదలైన గుర్తింపు పత్రాలు మరియు వారు విదేశాల్లో ఉన్నారనీ, ఇంతకు ముందు ఈ సదుపాయం వినియోగించుకోలేదని నిరూపించడానికి అవసరమైన పత్రాలు, NRI లు తెచ్చిన SBNs గురించి కస్స్టమ్స్ సర్టిఫికేట్ సమర్పించి, ఈ సదుపాయం పొందవచ్చు. మరొకరి పేరుతో ఈ సదుపాయం అనుమతించబడదు.
పై షరతులు పూర్తి చేసి, సమర్పించిన నోట్లు నిజమైనవి అయితే, అర్హమైన సొమ్ము, సమర్పించిన వారి బ్యాంక్ ఖాతాకు (KYC నిబంధనలు పాటించబడిన) జమ చేయబడుతుంది.
ఈ సదుపాయం భారత పౌరులకు జనవరి 2, 2017 నుండి మార్చ్ 31, 2017 వరకు, NRIలకు జనవరి 2, 2017 నుండి జూన్ 30, 2017 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ సదుపాయం రిజర్వ్ బ్యాంక్ ముంబై, న్యూ దిల్లీ, చెన్నై, కోల్కతా మరియు నాగ్‌పూర్ కార్యాలయాల ద్వారా లభ్యమౌతుంది.
నేపాల్, భూటాన్, పాకిస్తాన్ మరియు బాంగ్లాదేశ్‌లలో నివసిస్తున్న భారత పౌరులు ఈసదుపాయానికి అర్హులు కారు.
రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో అసంతృప్తి చెందిన వ్యక్తులు, వారికి రిజర్వ్ బ్యాంకు నుండి నిరాకరణ వర్తమానం అందిన పధ్నాలుగు రోజుల లోపున, రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్‌కు అపీల్ చేసుకోవచ్చును. ఈ నివేదనలు, సెంట్రల్ బోర్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఈండియా, సెక్రటరీస్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, 16 వ అంతస్తు, షహీద్ భగత్‌సింగ్ మార్గ్, ముంబై-400 001, చిరునామాకు పంపవలెను.
ఇతర వివరాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైట్ https://rbi.org.in లో లభ్యమౌతాయి.
ఈ సదుపాయం భారత ప్రభుత్వ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ (సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్), ఆర్డినెన్స్, 2016 సెక్షన్ 4 (1) తేదీ డిసెంబర్ 30, 2016 (Section 4 (1) Specified Bank Notes (Cessation of Liabilities) Ordinance, 2016 dated December 30, 2016) మరియు నోటిఫికేషన్ S.O. 4251 (E) తేదీ డిసెంబర్ 30, 2016, అనుసారముగా ప్రవేశపెట్టబడినది.
అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2016-2017/1728 |