తేది: 03/05/2019
ది మడ్గాఁమ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. మార్గావ్, గోవాకు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశాలు జారీ చేసినది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రజా శ్రేయస్సుదృష్ట్యా, ది మడ్గాఁమ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మార్గావ్, గోవాకు, నిర్దేశాలు విధించడం అవసరమని భావించింది. అందువల్ల, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949, సెక్షన్ 35A (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు)( సెక్షన్ 56 తో కలిపి), సబ్-సెక్షన్ (1) క్రింద తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ది మడ్గాఁమ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మార్గావ్, గోవాకు మే 02, 2019 పనివేళల ముగింపునుండి, నిర్దేశాలు జారీచేయడమైనది. ఈనిర్దేశాల అనుసారంగా, ది మడ్గాఁమ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., మార్గావ్ , గోవా, రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి లేనిదే, ఈ క్రింద విధించిన నిర్దేశాలను అతిక్రమించి అప్పులు, రుణాలు జారీ చేయుట/నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులు, క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటతోసహా ఎటువంటి భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగాగాని ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదు.
i. ప్రతి సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఏ ఇతర డిపాజిట్ ఖాతాలో (ఏ పేరుతో పిలవబడినా), గల మొత్తం నిల్వనుండి, రూ. 5,000/- (ఐదు వేల రూపాయిలు) మించకుండా ఉపసంహరించుటకు (విత్‌డ్రా చేయుటకు) బ్యాంక్ అనుమతించవచ్చు. కానీ ఖాతాదారు, రుణ గ్రహీతగాగాని, హామీదారుగాగానీ బ్యాంకుకు బకాయి ఉన్నట్లయితే, ఈ సొమ్ము, మొదట అట్టి బకాయిలకు చెల్లువేయవలెను.
ii. ప్రస్తుతంగల కాలపరిమితి డిపాజిట్లు, అదే పేరుమీద, అదే హోదాలో, నవీకరించవచ్చు.
iii. ఈ క్రింది అవసరాలకు సొమ్ము ఖర్చు చేయవచ్చు:
a. ఉద్యోగుల జీతాలు
b. అద్దెలు, పన్నులు
c. విద్యుత్ బిల్లులు
d. ముద్రణ, కార్యాలయి సామగ్రి
e. తపాలా ఖర్చులు మొ.వి
f. కోర్ట్/ఆర్ సి ఎస్/డి ఆర్ టి చట్టాలు లేక నిబంధలను అనుసరించి చెల్లించవలసిన స్టాంప్ డ్యూటీ/రిజిస్ట్రేషన్ ఖర్చులు/ఆర్బిట్రేషన్ రుసుము.
g. కోర్ట్ ఆదేశాలు /చట్ట నిబంధనల ప్రకారం చెల్లించవలసిన రుసుములు.
h. రూ. 5000/- (ఐదువేల రూపాయులు) మించకుండా న్యాయవాదులకు చెల్లించవలసిన రుసుము (ప్రతి ఒక్క కేసుకు).
iv. డిపాజిట్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కు చెల్లించవలసిన ప్రీమియమ్.
v. బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు సాగించుటకు అవసరమని భావించిన ఖర్చు. అయితే, ఈఖర్చు నిర్దేశాల జారీకి ముందు ఆరు నెలలలో, అదే అవసరానికి చేసిన సగటు ఖర్చుకు మించరాదు. గతంలో చేయని ఎదైనా క్రొత్త ఖర్చు అవసరమయిన పక్షంలో, ఆ ఖర్చు రూ. 1000/ (ఒక వెయ్యు రూపాయిలకు) మించరాదు.
vi. ప్రభుత్వ / ఎస్ ఎల్ ఆర్‌కు అనుమతించిన సెక్యూరిటీలలో, పెట్టుబడి.
vii. మూలధనం కొరకు ప్రస్తుత సభ్యులు చేసిన చెల్లింపు. వీటి వివరాలు ప్రతినెలా రిజర్వ్ బ్యాంకుకు తెలియపరచవలెను.
viii. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు చెల్లించవలసిన గ్రాట్యుఇటీ / ప్రావిడెంట్ ఫండ్.
ix. పదవీ విరమణ పొందుతున్న/పొందిన ఉద్యోగులకు, రిజర్వ్ బ్యాంక్ అనుమతితో, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ మరియు సూపరేన్యుఏషన్ చెల్లింపులు.
x. రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక లిఖితపూర్వక అనుమతి లేనిదే ఏ ఇతర ఖర్చులు / చెల్లింపులు చేయరాదు.
డిపాజిట్ ఖాతాలలోని (ఏ పేరుతో పిలువబడినా) సొమ్ము, రుణ బకాయిలకు సరిపెట్టుకోవచ్చు/చెల్లు వేసుకోవచ్చు. అయితే, రుణ ఒప్పందంలో, డిపాజిట్ ఖాతాలలోని సొమ్ము ఆ విధంగా చెల్లువేసుకోవచ్చని నిబంధన పొందుపరచబడి ఉండాలి. ఈ సందర్భంగా, బ్యాంకు ఈ క్రింది షరతులు పాటించవలెను:
a. అట్టి చెల్లుబాటుచేసే తేదీన, ఖాతా కె వై సి నిబంధనలు అనుసరించి ఉండవలెను.
b. పూచీదార్లతోసహా ఇతర వ్యక్తుల పేరున గల డిపాజిట్లు ఈ విధంగా చెల్లుబాటు చేయరాదు.
c. ఈ విధంగా చెల్లుబాటు చేయకుంటే, రుణం నిరర్ధక ఆస్తిగా మారిపోయే ప్రమాదంగల సందర్భాలలో, ఖాతాదారుకు తగిన నోటీసు జారీచేసి, ఈ నిర్ణయం తీసుకోవలెను. సక్రమంగా తిరిగి చెల్లింపు చేస్తున్న రుణాల విషయంలో లేక రుణ ఒప్పందంలోని నిబంధనలలో ఏదేని మార్పు చేయదలచినా, ఖాతాదారు లిఖితపూర్వక అనుమతి అవసరం.
d. డిపాజిట్‌గాని దాని చెల్లుబడిగాని, కోర్ట్ జారీచేసిన అటాచ్‌మెంట్/ ప్రొహిబిటరీ ఆర్డర్ లేక శాసనరీత్యా అధికారముగల ఇతర చట్టబద్ధ సంస్థల నిబంధనలకు వ్యతిరేకముగా లేక రాష్ట్ర సహకార సంఘాల చట్టం మొదలైన నిబంధనల ప్రకారం; ఎర్నెస్ట్ మనీ డిపాజిట్; ట్రస్ట్ సొమ్ము; మూడవ పార్టీ లీన్, అయి ఉండరాదు.
ఈ నిర్దేశాల నకలు, ప్రతి ఖాతాదారుకు పంపవలెను మరియు బ్యాంకు వారి వెబ్‌సైట్‌యొక్క, హోమ్ పేజ్‌లో ప్రదర్శింపవలెను.
ఇంతేగాక, ది మడ్గాఁమ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. మార్గావ్, గోవా, వారి కార్యకలాపాలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ సూచించిన నివేదికలను, జనరల్ మానేజర్ (ఆఫీసర్ ఇన్-చార్జ్), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గెరాస్ ఇంపీరియమ్ II, 7 వ అంతస్తు, ఇ డి సి కాంప్లెక్స్, ప్యాటో ప్లాజా, పానాజి-403 001, గోవాకు సమర్పించవలెనని ఆదేశిస్తున్నది.
ఈ నిర్దేశాలు, మే 02, 2019 పనివేళల ముగింపు సమయంనుండి, ఆరు నెలల కాలం, సమీక్షకులోబడి, అమలులో ఉంటాయి.
శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2601 |